తెలుగుబిడ్డ
ఓ తెలుగోడా! సోదరా!
తలపాగే తలవోలె గలవోడా!
ఓ తెలుగోడా! సోదరా!
తలదన్నే తెగువెంతో గలవోడా!
ఓ తెలుగోడా! సోదరా!
పూనుకోరా సూరీడి వెలుగోడా!
ఓ తెలుగోడా! సోదరా!
వినుకోరా ఓరోరి తెలుగోడా!
ఓ తెలుగునారీ! సోదరీ!
సారించిన వీరకదన వింటినారీ!
ఓ తెలుగునారీ! సోదరీ!
మ్రోగించిన స్వాభిమాన సమరభేరీ!
ఓ తెలుగునారీ! సోదరీ!
పూనుకోవే పొంగారు గంగాఝరీ!
ఓ తెలుగునారీ! సోదరీ!
వినుకోవే ఓ తెలుగునారీ!
తెలుగుందా?
నీ మాటలో? నీ బాటలో?
తెలుగుందా?
నీ ఆటలో? నీ పాటలో?
తెలుగుదనముందా?
నీ కట్టెలో? నీ మట్టిలో?
తెలుగుదనముందా?
నీ కట్టులో? నీ బొట్టులో?
ఓ తెలుగుబిడ్డా!
తెలుగంటే
ఏ పండుగ ఆటవిడుపో కాదు
మన గుండెల పట్టూ విడుపు!
తెలుగంటే
ఏ పబ్బపు పిండివంటలో కాదు
మన గుండెలు పెట్టే కుడుపు!
ఓ తెలుగుబిడ్డా!
తెలుగంటే
ఏ పద్యమో ప్రబంధమో కాదు
మన జాతి భావజాలపు దొంతర!
తెలుగంటే
ఏ కావ్యపు సుగంధమో కాదు!
మన జాతి ఆత్మగౌరవ పరంపర!
ఓ తెలుగుబిడ్డా!
తెలుగంటే
ఏ పండితుడు వండివార్చే గద్యమో కాదు
మనమందరమూ నూర్చెడి పసిడిసేద్యము!
తెలుగంటే
ఏ ఒక్కడి కడుపాకలి తీర్చే నైవేద్యమో కాదు
మనందరినీ కూర్చెడి అనుభవైకవేద్యము!
ఓ తెలుగుబిడ్డా!
తెలుగంటే
వేళ్లూనుకున్న చిరసంస్కృతికి
చిహ్నమై చిగురించిన పూవురా!
తెలుగంటే
వీణియనాదాల స్వరసరస్వతికి
తేనియవిందులిడిన తావమ్మా!
తెలుగంటే
చులకనేల పలకను?
తెలుగంటే
ఉలకవేల పలకవు??
ఓ తెలుగుబిడ్డా!
తెలుసుకోరా
నీదు భాష నిండుజాబిలియని!
తెలుపుకోమ్మా
నీదు శ్వాస గండుబెబ్బులిదని!
చాటవెందుకురా
నీదు జాతి నిండుగౌరవమును?
దాటవెందుకమ్మా
నీదు బాస దాస్యశృంఖలమును?
నిలబడదెందుకురా
నీదు వాడి మేరుశిఖరతుల్యమై?
కలబడదెందుకమ్మా
నీదు నాడి మహాత్రిశూలబల్లెమై?
మరగబడదెందుకురా
నీదు నెత్తురు పరాయి పల్లెత్తుమాటకు?
తిరగబడదెందుకమ్మా
నీదు సత్తువ పరాయి పెత్తనపుకోటపై?
ఏల సేద తీరవురా
నీదు కన్నతల్లి తీయని ఒడిలో?
ఏల నేడు చేరవమ్మా
నీదు కన్నతల్లి కమ్మని బడిలో?
అక్షరాలా అక్షరలక్షలు చేసే
అచ్చులు మనవేరా! ఓ సోదరా!
హంసహొయలెన్నెన్నో పోయే
హల్లులు మనవే! ఓ సోదరీ!
కోకిల కూసే ఆమని పూసే
శబ్దము మనదేరా! ఓ సోదరా!
కూతను ఆపే పూతను మాపే
ప్రారబ్దము మనదే! ఓ సోదరీ!
రతనాలు కురిసే ముత్యాలు మురిసే
వ్రాత మనదేరా! ఓ సోదరా!
రాళ్లంటూ జమకట్టే, రప్పలంటూ విసిరికొట్టే
తలవ్రాత మనదే! ఓ సోదరీ!
తెలుగు వాడవు!
నీవెటుల తెలుగువాడవు?
తెలుగు వాడవు!
నీవెటుల తెలుగుదానవు?
ఓ తెలుగుబిడ్డా!
తెలుగంటే తల్లిరా!
ఆంత హీనంగా ఎలా చూస్తావు?
తెలుగంటే తల్లిరా!
ఇంత హీనంగా ఎలా చస్తావు??
ఇంకా ఆలస్యము కాలేదు
అమృతము విషము కాలేదు!
మాపన్నది గడవకముందే
రౌలరా జనని నుదుట సూరీడువై!
రేపన్నది అడగకముందే
ఏలరా జనని తోడుగ ఇలఱేడువై!
ధ్వజమెత్తు
నీదు అమ్మ ఉసురుదీసిన
నీదు నిర్లక్ష్యపుధోరణిపై!
భుజమెత్తు
నీదు అమ్మను ఊరెరిగింపను
నీదు గుండియపల్లకీపై!
- రుద్ర✍🏾