గుండెలమీద చెయ్యేసుకుని
‘అమ్మా' అని
దిక్కులు పిక్కటిల్లేలా అరిచాననుకున్న
నా ఆర్తనాదము
అమ్మ చెవులకు సోకిందో లేదో??
ఆవురావురంటూ
నేను బడినుండి తిరిగొచ్చి తింటానని
పప్పలు చేసుకుంటూ
అమ్మ నింపాదిగా కూర్చుందో ఏమో?
'నాన్నా' అని
గొంతు పగిలిపోయేలా పిలిచాననుకున్న
నా ఆక్రందనము
నాన్న గుండెలకు తాకిందో లేదో??
అడుగుతున్నానని
నేను బడినుంచి తిరిగొచ్చి ఆడుకుంటానని
బొమ్మలు వెతుక్కుంటూ
నాన్న ఏ వీధుల్లో తిరుగుతున్నాడో ఏమో?
'ఊ'లు కొట్టే నాథుడులేక
'ఇంకొక కథ' అన్నా విసుక్కోకుండా
కమ్మని కథలు చెప్పే తాతయ్య నోరు
శాశ్వతముగా మూగబోతుందేమో?
'ఊహూ' అన్నా వినిపించుకోక
'ఇంకొక్క ముద్ద' అని బ్రతిమాలకుండా
గోరుముద్దలు పెట్టని నానమ్మ చేయి
సత్తువలేక చచ్చుబడిపోతుందేమో?
ఇవ్వాళ ప్రొద్దున్నే
నిద్రలేవగానే నేను తెరతీసిన
'కడుపునెప్పి' నాటకాన్ని
ఇంకాస్త రక్తికట్టించుంటే బాగుండేదేమోనని
'జేజే' అనుకున్నాడా?
ఏమో?
నా చిట్టిపొట్టలో
నిప్పులు చిమ్ముతూ కురుస్తున్న
మండే ఇనుపముక్కల వర్షాన్ని
అందుకే కురిపించాడా?
ఏమో?
కక్షతో కార్పణ్యముతో రగిలి
నిప్పులు రాల్చాల్సిన కళ్ళు
నవ్వులపువ్వులయ్యాయని
ఎవరికైనా పట్టరాని కోపమా?
ఏమో?
నేనేం తప్పు చేసానా అనుకుందామనుకుంటే
ఆలోచిద్దామంటే నొప్పి!
అడుగుదామంటే నొప్పి!
అమ్మకో నాన్నకో చెప్పుకుందామనుకుంటే
కదలలేనంతటి నొప్పి!
మెదలలేనంతటి నొప్పి!
ఎర్రటి ఎండకు
నా చెంపలు కందిపోతేనే
కళ్ళొత్తేసుకునే 'అమ్మ'
ఎర్రటి నెత్తురుమడుగులో
నన్ను చూసి తట్టుకుంటుందా?
'ఆయమ్మా'! మంచిదానివి కదూ!
నన్ను తుడిచెయ్యవూ?
ఎక్కడైనా పడిపోయి
పిసరంత చర్మము చీరుకుపోతేనే
కళ్లనీళ్లు పెట్టుకునే 'నాన్న'
తూట్లకింద ఛిద్రమైపోయిన
నన్ను చూసి నిలబడగలడా?
'ఆయమ్మా'! మంచిదానివి కదూ!
నన్ను కప్పెయ్యవూ?
రెక్కలు మొలిచి
రేపటి స్వేచ్ఛాప్రపంచములోకి
రివ్వున ఎగురుతాననే
అమ్మా నాన్నా కన్న కలలు
రెక్కలు తెగి పడిపోయాయిలా!
'ఆయమ్మా'! మంచిదానివి కదూ!
నన్ను ఎత్తుకోవూ?
నేను నేలరాలి
టపాటపా కొట్టుకుంటుంటే
నేలతల్లి గుండెలు పగిలి
నెఱ్ఱలు పడిపోయాయిలా!
'ఆయమ్మా'! మంచిదానివి కదూ!
నన్నందులో దాచెయ్యవూ?
ఇదుగో!
ఓపిక అయిపోవస్తోంది
గుండెలు ఆగిపోతున్నాయి
అదుగో!
అంతిమశ్వాస వస్తోంది
కళ్ళు మూతలు పడిపోతున్నాయి
ఇక అమ్మపాట లేదు
నాన్నతో ఆట లేదు
నాకంటూ ఏమీలేదు
నేనంటూ ఉండను
అందుకే చివరిగా ఒక్కమాట!
నేననే చిరుదివ్వెను
ఇంక వెలగలేను!
నావనే చిరునవ్వులు
ఇంక వినబడవు!
నా కంట్లో
మీరు నింపిన ఈ చిమ్మచీకట్లలో
గుండెల మీద చెయ్యేసుకుని
హాయిగా నిదురపొండి!
నా ఒంట్లో
మీరు నింపిన ఈ శ్మశాననిశ్శబ్దములో
గుండెల మీద చెయ్యేసుకుని
మనుషులమని చెప్పండి!
- రుద్ర✍🏾