'నేను' చావలేదు!
నిన్నటి నిశ్శబ్దనిశీధినిలో భస్మీపటలమై
కరిగిపోయాయనుకున్న
పుంఖానుపుంఖాల ఆలోచనానిప్పుకణికలు
భగ్గుభగ్గుమనే
పునరాలోచనల కార్చిచ్చురవ్వలను
నేటి ఈ నవోదయాన
నిత్యనూతనంగా రాజేస్తున్నాయంటే
నా తలపోతల వెర్రితలలు
కపాలమోక్షానికి నోచుకొని తెగిపడక
వేడిసెగలను చిమ్ముతూ
వేలనాల్కలను చాస్తున్నాయంటే
నిదురక్షణాల చితుకుల నడుమ
మరపు చితిమంటలలో నెరపబడిన
నిన్నటి నా దహనసంస్కారక్రతువులో
వెచ్చటి వేచిచూతల నివురుదుప్పట్లలో
తెగజోగిన అహంకారపు అస్తికలేవో
బట్టబయలై భయపెడుతున్నాయంటే
ఇంకా
'నేను' చావలేదు!
- రుద్ర✍🏾