చెలీ! వరమీయవే


Cover Image for చెలీ! వరమీయవే

నీ నగవు కనరాక యుగమాయెనే
భువనాన ఆమని కరువాయెనే!
నీ కనుపాపల మెరుపులతో
చెలీ!
చిరుచిరు దరహాస వరమీయవే!

నీ సడులు వినరాక యుగమాయెనే
పవనాన జావళి కరువాయెనే!
నీ పెదవంచుల విరుపులతో
చెలీ!
చిరుచిరు వచనాల వరమీయవే!

నీ కురుల జతలేక యుగమాయెనే
గగనాన యామిని కరువాయెనే!
నీ ముంగురుల నీలిమతో
చెలీ!
చిరుచిరు మాపుల వరమీయవే!

నీ కన్నుల జిగిలేక యుగమాయెనే
హృదయాన వెన్నెల కరువాయెనే!
నీ కనురెప్పల మాలిమితో
చెలీ!
చిరుచిరు చూపుల వరమీయవే!

నీ మధురజతి లేక యుగమాయెనే
శతరాగగానము కరువాయెనే!
నీ సుధాకరపు స్వరముతో
చెలీ!
చిరుచిరు మధువుల వరమీయవే!

నీ ప్రణయఝరి లేక యుగమాయెనే
మనసున చిత్తడి కరువాయెనే!
నీ మమకారపు పిరిమితో
చెలీ!
చిరుచిరు వలపుల వరమీయవే!

- రుద్ర✍🏾

అభిప్రాయాలు :


    మరిన్ని ...

    మొత్తం - 112
    మరిన్ని...(101)