జాగృతతీర్థము
ఉన్నది ఉన్నట్టు
లేనిది లేనట్టు
సహజముగా కనగలుగుతున్నావా?
రవిలా శశిలా
భువిలా పవిలా
సహజముగా మనగలుగుతున్నావా?
ప్రాణాన్ని కాలాన్ని
సత్యాన్ని ధర్మాన్ని
సహజముగా శ్వాసించగలుగుతున్నావా?
ఆవేశకావేశాలను
భావనోద్రేకాలను
సహజముగా ఆశ్వాసించగలుగుతున్నావా?
నవ్వుతున్నావా
నిన్ను చూసిన పువ్వులన్నీ నేర్చుకునేలా!
నవ్వుతున్నావా?
రగిలే గుండె, రవ్వలను చల్లార్చుకునేలా!
నడుస్తున్నావా?
అడుగుజాడల్లో అవనిని చేర్చుకునేలా!
నడుస్తున్నావా?
విశ్వచితులు నీ హృదిపై పేర్చుకునేలా!
అదే నిజమైతే అదే నైజమైతే
అదే నిత్యమైతే అదే కృత్యమైతే
నీకెవ్వరి ప్రచోదనమూ అక్కరలేదు
నీకెవ్వరి ప్రకటనమూ అక్కరలేదు
నీ ఉచ్ఛ్వాసనిశ్వాసలే ఉద్ఘాటిస్తాయి!
నీ ఉసురు ప్రకంపనలే ఉగ్గడిస్తాయి!
నువ్వొక పునరావృతార్థమని!
నువ్వొక జాగృతతీర్థమని!
- రుద్ర✍🏾